ఇంటర్నెట్ డెస్క్: ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడానికి చాలామంది నీరు తాగుతారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారికి ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఎవరికి మంచిది కాదు? సాధారణంగా, దంత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నేరుగా నీరు తాగకూడదు. ఇందులో పయోరియా (చిగుళ్ల వ్యాధి), నోటి పూతలు, నోటి క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్నవారికి, లాలాజలంలోని హానికరమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే, నీటితో పాటు లాలాజలాన్ని మింగితే, హానికరమైన బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల, అటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నీరు తాగే ముందు మౌత్ వాష్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడు నోటిలోని బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత, నీరు తాగడానికి సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు.
ఆరోగ్యవంతులైన వ్యక్తులు, లాలాజలాన్ని ఉమ్మివేయడం కంటే మింగడం మంచిదని భావిస్తారు. ఎందుకంటే లాలాజలంలోని ఎంజైమ్‌లు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అందువల్ల, అనవసరంగా లాలాజలాన్ని ఉమ్మివేయడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో సరిగ్గా నీరు తాగడం, నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం వల్ల మన మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.




















