పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలు, ఆయన చేస్తున్న నిరంతర కృషిని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. చంద్రబాబును “తిరుగులేని శక్తి”గా అభివర్ణించారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో పెట్టుబడిదారులకు నేరుగా రాయితీలు అందించేందుకు ఎస్క్రో విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించటం, ఆయన దూరదృష్టికి నిదర్శనమని ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాయితీలు, భూ కేటాయింపులు, వేగంగా అనుమతులు అందిస్తోంది. ఇకపై అధికారుల చుట్టూ తిరగకుండా నేరుగా ఎస్క్రో విధానంలో ప్రయోజనాలను అందిస్తాం. మేము అమలు చేస్తున్న విధానాలతో గత 18 నెలల్లోనే 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే మూడు ఏళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తాం. లక్షల ఉద్యోగావకాశాలు సృష్టిస్తాం’’ అని సీఐఐ సదస్సులో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ఆయన వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
మహీంద్రాకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నానని చంద్రబాబు స్పందన
ఆనంద్ మహీంద్రా పోస్టుకు ప్రతిస్పందించిన చంద్రబాబు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు.



















