హైదరాబాద్: భారత సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన సినిమా ‘బాహుబలి’ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈసారి మాత్రం కొత్త రూపంలో. ‘బాహుబలి: ది ఎపిక్’ అనే టైటిల్‌తో బాహుబలి 1 మరియు బాహుబలి 2 సినిమాలను కలిపి ఒకే చిత్రంగా ఈ నెల 31న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానా దగ్గా బాటి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని చిత్రీకరణకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇంటర్వ్యూలో రాజమౌళి ‘బాహుబలి: ది ఎపిక్’ ఎడిటింగ్‌పై మాట్లాడుతూ కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. “సినిమా రన్‌టైమ్ 3 గంటల 45 నిమిషాలుగా ఉంటుంది. అందుకే కొంత భాగాన్ని కత్తిరించాం. అవంతిక లవ్‌స్టోరీలోని కొన్ని సన్నివేశాలు, పచ్చబొట్టేసిన పాట, ‘ఇరుక్కుపో’ సాంగ్, ‘కన్నా నిదురించరా’ పాట, అలాగే యుద్ధానికి సంబంధించిన కొన్ని సీక్వెన్స్‌లను తొలగించాం,” అని రాజమౌళి వెల్లడించారు.
అదే సందర్భంలో రాజమౌళి హీరోలతో మాట్లాడుతూ, “మీరు సినిమాలోని పాత్రలకు ఎప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు?” అని ప్రశ్నించగా, రానా స్పందిస్తూ, “మీరు ఓ మ్యాప్‌తో కథ చెప్పిన రోజే ఇది నా రాజ్యం అని అనిపించింది. కిరీటంపై చేయి పెట్టి మాట్లాడే సీన్‌లో మాత్రం ఆ భావం మరింత బలపడింది,” అని అన్నారు.
ప్రభాస్ కూడా తన అనుభవాలను పంచుకుంటూ, “ప్రతి సినిమాలోలాగే మొదటి మూడు రోజులు టెన్షన్‌గానే ఉండేది. కానీ సేతుపతి తల నరికే సీన్ పూర్తయ్యాక నేను పాత్రలోకి పూర్తిగా వచ్చేశా. ఆ తర్వాత దేవసేన ఎంట్రీ, కోర్టు సీన్, బహిష్కరణ సన్నివేశాలు అన్ని మొదటివారంలోనే పూర్తయ్యాయి. దాని తరువాతి దండాలయ్యా సాంగ్ మాత్రం మూడేళ్ల తర్వాత తీశాం,” అని చెప్పారు.
రాజమౌళి ఆ రోజులను గుర్తుచేసుకుంటూ, “కోర్టు సీన్‌కన్నా ముందు కర్నూలులో తీసిన సన్నివేశం గుర్తుందా?” అని అడిగారు. దానికి ప్రభాస్ నవ్వుతూ, “జనం మధ్య షూటింగ్ చేయడం నేనెప్పుడో మానేశా. కానీ ఈయన (రాజమౌళి) అయితే చేయిస్తాడు. ఆ రోజు వర్షం, జనాలు మధ్యలో షూటింగ్ సాధ్యమవుతుందా అనుకున్నా. కానీ చివరికి మీరు అందరితో హాయ్ చెప్పించి ఆ సీన్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీశారు,” అని గుర్తుచేశారు.
అందుకు రాజమౌళి సంతోషంగా స్పందిస్తూ, “అది నిజంగా అద్భుతమైన షాట్,” అని అన్నారు.
‘బాహుబలి: ది ఎపిక్’ విడుదలకు రోజులు దగ్గరపడుతుండటంతో, అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈసారి రాజమౌళి విజువల్ మాస్టర్పీస్ ఏ కొత్త అనుభూతిని అందిస్తుందో చూడాలి.




















