వివిధ వంటకాల రుచిని పెంచడంలో వెన్న కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రుచికోసం మాత్రమే కాదు, వెన్నకు మరెన్నో అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దైనందిన జీవితంలో వెన్నను ఇలా కూడా ఉపయోగించొచ్చు చూడండి –
⚛ తలుపులు మూసే సమయంలో వచ్చే శబ్దం ఇబ్బంది పెడుతుంటే, మడత బందులపై కొద్దిగా వెన్న రాస్తే ఆ శబ్దం పూర్తిగా పోతుంది.
⚛ ప్లాస్టిక్ వస్తువులపై ఉన్న మరకలు తొలగించడం కష్టమే. అయితే మరకపై కొద్దిగా వెన్న రాసి 20–30 నిమిషాల తర్వాత వస్త్రంతో తుడిస్తే అవి సులభంగా పోతాయి.
⚛ చేతులకు గ్లూ అంటుకున్నప్పుడు శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చేతులకు ముందుగా కొద్దిగా వెన్న రాసి తుడిస్తే గ్లూ సులభంగా వదిలిపోతుంది.
⚛ చేపలు శుభ్రం చేసిన పాత్రల నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడానికి వాటిపై కొద్దిగా వెన్న రాసి తర్వాత గోరువెచ్చని నీటితో సబ్బుతో తోమాలి. వాసన పూర్తిగా పోతుంది.
⚛ రాత్రి నిద్రకు ముందు గోళ్లకు కొద్దిగా వెన్న రాస్తే అవి బలంగా, మెరిసేలా పెరుగుతాయి.
⚛ పొడిబారిన చర్మంపై వెన్న రాసి కొద్దిసేపు ఉంచి తర్వాత మృదువైన సబ్బుతో శుభ్రం చేస్తే చర్మం తేమను తిరిగి పొందుతుంది.
⚛ బిగుసుకుపోయిన ఉంగరాలు తీయడం కష్టంగా ఉంటే వేళ్లకు వెన్న రాస్తే అవి సులభంగా జారిపోతాయి.
⚛ కోసిన ఉల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే వాటి పైభాగానికి కొద్దిగా వెన్న రాయాలి. ఇది ఉల్లిపాయను తాజాగా ఉంచుతుంది.
⚛ చెక్క ఫర్నిచర్‌పై నీటి మరకలు పడితే రాత్రి వేళ వాటిపై వెన్న రాసి మరుసటి రోజు తుడిస్తే మరకలు మాయం అవుతాయి.




















