పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో చమురు ధరలు పెరగడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి.
ఈ ప్రభావంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. చమురు ధరల పెరుగుదల వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందన్న భయాలు పెట్టుబడిదారులను కలవరపెట్టాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారత రిజర్వ్ బ్యాంక్‌లు సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు తగ్గవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి.
అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) భారీగా షేర్లను విక్రయించడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. ఒక దశలో సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా పడిపోయినా, చివరకు కొంత కోలుకుని 1122.66 పాయింట్ల నష్టంతో 79,116.19 వద్ద ముగిసింది.మరోవైపు నిఫ్టీ కూడా 385.20 పాయింట్లు పడిపోయి 24,480.50 వద్ద స్థిరపడింది. మార్కెట్ పతనం కారణంగా మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.10 లక్షల కోట్లు తగ్గి రూ.456 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీలలో భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే లాభాల్లో నిలవగా, మిగతా కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్లు భారీగా పతనమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రభావం కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరగా, బంగారం ధర ఔన్సుకు 5185 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పశ్చిమాసియా పరిస్థితులు స్థిరపడే వరకు మార్కెట్లలో ఒత్తిడి కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















