దిల్లీ: సైన్యంలోని వివిధ ర్యాంకుల్లో పోరాట సంసిద్ధతను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా సిబ్బంది దేహదారుఢ్య నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. ఈ మేరకు అగ్నివీరుల నుంచి ఉన్నతాధికారుల వరకూ ఏడాదికి రెండుసార్లు సంయుక్త శారీరక పరీక్షలు చేయించుకొని ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. భారత సైన్యంలోని విశ్వసనీయ వర్గాలు గురువారం ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల మేరకు 50 ఏళ్ల వయసు వచ్చేదాకా అధికారులు, సిబ్బంది ఏటా రెండు వేర్వేరు దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి వచ్చేది. యుద్ధ భౌతిక సామర్థ్య పరీక్ష (బీపీఈటీ), భౌతిక ప్రావీణ్య పరీక్ష (పీపీటీ) పేరిట ఇవి ఉంటాయి. ఈ లెక్కన 50 ఏళ్లు పైబడి ఎక్కువ సీనియారిటీ గల అధికారులకు మినహాయింపు వర్తిస్తూ వచ్చింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న సవరించిన నిబంధనల ప్రకారం.. కొత్త పరీక్షలకు వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచనున్నారు. అగ్నివీరుల నుంచి త్రీ-స్టార్ ఆర్మీ కమాండర్ల వరకు ఇవే వర్తిస్తాయి.




















