గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యం పరంగా ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ నూతన విధానాలపై చర్చ జరిగింది. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరైన అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం పాల్గొంది. ఈ బృందంలో UN AIDS ప్రతినిధి పీటర్ పాయిట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఎఐజీ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటా, శ్రీకాంత్ నాదముని, గగన్ దీప్ కాంగ్, మార్గరెట్ ఎలిజిబెత్, నిఖిల్ టాండన్, ఇతర వైద్య నిపుణులు ఉన్నారు. సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు పాల్గొన్నారు.


















