ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం ఎస్‌ఐసీబీ సమావేశంలో తెలిపారు.
మరావతి:
రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు “క్వాంటమ్ వ్యాలీ” తరహాలో సాంకేతిక రంగంలో కీలక మలుపు తీసుకురుస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను వైవిధ్యం గల పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. విశాఖకు ఎకనమిక్ కారిడార్ తరహా అభివృద్ధి, రాయలసీమకు ప్రత్యేక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
SIPB సమావేశంలో పలు సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన అనంతరం చంద్రబాబు వివరించారు:
- తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు విశాఖ కేంద్రంగా,
- ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అమరావతి కేంద్రంగా,
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, రాయలసీమ జిల్లాలను కలిపి మరో కేంద్రంగా,
మొత్తం మూడు ఎకనమిక్ డెవలప్‌మెంట్ రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.
రాయలసీమలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ను డీమ్డ్ విశ్వవిద్యాలయంగా హోదా పెంచి వివిధ సంస్థలతో అనుసంధానించాలని సూచించారు. కూచిపూడి, థింసా వంటి సంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తూ, వివిధ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ తరహా ఉత్సవాలను విశాఖ, రాజమహేంద్రవరం నగరాల్లో కూడా నిర్వహించాలన్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు:
భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఆర్సెలర్ మిత్తల్, రైడెన్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించే వరకు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామిక ప్రాజెక్టులను లాజిస్టిక్స్‌తో అనుసంధానించాలి. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నీటి సరఫరా, వినియోగం వంటి అంశాలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. 2028 నాటికి జిందాల్ ఉక్కు కర్మాగారం పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అమెరికాలోని వర్జీనియా నగరం “డేటా వ్యాలీ”గా ప్రసిద్ధి పొందినట్టు, గూగుల్, రైడెన్ ప్రాజెక్టుల ద్వారా విశాఖ కూడా డేటా వ్యాలీ నగరంగా అభివృద్ధి చెందబోతోంది అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. “త్వరలో టీసీఎస్ క్యాంపస్ ప్రారంభం కానుంది. విశాఖలో సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు.
అలాగే, ఐటీ కంపెనీలు మరియు ఉద్యోగులకు ఇళ్లతో పాటు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు అందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి, టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాక, 5 లక్షల మంది ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పనిచేయించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలని మంత్రి సూచించారు.



















