ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, ఎంబీఏ చదివిన వ్యక్తి వ్యసనాలకు బానిసై చివరకు మోసాల బాట పట్టి కటకటాల పాలయ్యాడు. బీమా పాలసీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన చిల్లర వెంకటేశ్వరరావును విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 25 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో మరో నిందితుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నెల్లూరుకు చెందిన వెంకటేశ్వరరావు గతంలో విజయవాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఉద్యోగాలు చేశాడు. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత జీవనోపాధి కోసం కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జూదాలకు అలవాటు పడడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన రవి అనే వ్యక్తితో కలిసి బీమా పాలసీదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడాలని ప్రణాళిక రూపొందించాడు.
ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రొఫెసర్ శివరంగ ప్రసాద్‌ను టార్గెట్ చేశారు. అప్పటికి ఆయన పపువా న్యూ గినియాలో ఉండటంతో పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నారు. బీమా సంస్థ ఉద్యోగినని చెప్పి ప్రీమియం చెల్లించాలని నమ్మబలికి మొదట రూ.50 వేలును, తరువాత రూ.3 లక్షలను తన ఖాతాలోకి వేయించుకున్నాడు.
ఇదే సమయంలో ప్రొఫెసర్‌కు బీమా కంపెనీల నుంచి రూ.50 లక్షల బోనస్ వచ్చిందని చెప్పి, విదేశాల్లో ఉండటం వల్ల సిమ్ పనిచేయదని పోర్టబులిటీ చేయించుకున్నాడు. మొబైల్ ఆపరేటర్ పంపిన కోడ్‌ను తీసుకుని సిమ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అనంతరం ప్రొఫెసర్ పాన్‌కార్డు, ఆధార్ వివరాలను కూడా సేకరించి అందులో తన పేరు, ఫొటోలను మార్చి పత్రాలను తయారు చేసుకున్నాడు.
ఆ పత్రాల ఆధారంగా ప్రొఫెసర్‌కు ఉన్న 18 బీమా పాలసీలను తన నియంత్రణలోకి తీసుకున్నాడు. 2023లో ఒక పాలసీని సరెండర్ చేసి రూ.4 లక్షలు పొందాడు. అదనంగా ప్రొఫెసర్‌కు ఉన్న హోమ్‌లోన్‌పై టాప్‌అప్ తీసుకుని సుమారు రూ.10 లక్షలను తీసుకున్నాడు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు కూడా పొందడంతో ఆ డబ్బును డ్రా చేసి వినియోగించాడు.
అంతేకాక హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఉన్న మూడు క్రెడిట్‌కార్డులను కూడా ఉపయోగించి దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాడు. బిల్లులు చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్లు ప్రొఫెసర్‌ను సంప్రదించడంతో అసలు మోసం బయటపడింది.
ఈలోగా మరో మూడు పాలసీలను సరెండర్ చేసి రూ.9.27 లక్షలు కూడా సొమ్ము చేసుకున్నాడు. మిగిలిన పాలసీలను కూడా సరెండర్ చేయడానికి ప్రయత్నించినా సంస్థలు అనుమతించలేదు. దీంతో భారత్‌కు వచ్చిన ప్రొఫెసర్ ముందుగా నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తరువాత విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడు రవిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















