67 వేల మందికి ఉపాధి – దేశంలోనే తొలి భారీ విదేశీ పెట్టుబడికి రైడెన్ ఆమోదం, 11వ ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ₹1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సుమారు 67 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఐటీ, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన పెట్టుబడి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం ఆమోదించింది.
కొత్త పెట్టుబడులకే కాకుండా, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల నుంచి వచ్చిన సవరణలపై కూడా SIPB చర్చించి ఆమోదం తెలిపింది.
దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని సాధించినందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను సీఎం చంద్రబాబు సహా మంత్రులు అభినందించారు.
అతిపెద్ద విదేశీ పెట్టుబడి – రైడెన్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనకు SIPB ఆమోదం తెలిపింది. విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ ₹87,520 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. SIPB అభిప్రాయ ప్రకారం, ఈ డేటా సెంటర్ స్థాపన కొత్త చరిత్రను సృష్టించనుంది.
విశాఖకు రాబోతున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ మూడు క్యాంపస్‌లను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం ఈ స్థాయి విదేశీ పెట్టుబడిని ఏడా పొందలేదు అని పేర్కొంది.
CM చంద్రబాబు అన్నారు:
“ఇప్పటి వరకు జరిగిన 11 SIPB సమావేశాల్లో ₹7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇచ్చాము. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 6.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. గత 15 నెలల పెట్టుబడుల ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. భారీ ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షించాలి. ఐటీ రంగానికి తక్కువ ధరలో విద్యుత్ అందించడం ఉపయోగకరం. రైడెన్, గూగుల్ వంటి సంస్థల ఏర్పాటుతో విశాఖ ఏఐ సిటీగా మారుతుంది.”




















