సాధారణంగా మనం ఏదైనా వ్యాధి ముందుగా కొన్ని లక్షణాలతో కనిపిస్తుందని అనుకుంటాం. కానీ ఇది తప్పుగా భావించడం. నిజానికి, కొన్నిసార్లు వ్యాధులు లక్షణాలు లేకుండానేరుగా వచ్చి ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. కొన్ని వ్యాధులు చివరి క్షణం వరకు గుర్తించబడవు, కొన్ని మాత్రం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాంతకంగా మారతాయి. ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే వ్యక్తి కూడా అకస్మాత్తుగా ప్రాణాలను కోల్పోవచ్చు.
ఇలాంటి తీవ్ర వ్యాధులు శరీరంలో నిశ్శబ్దంగా ప్రవేశించి అవయవాలను దెబ్బతీస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స చేపట్టకపోతే, అవి ప్రాణాంతకంగా మారుతాయి. అందువల్ల, ఈ రకమైన వ్యాధుల గురించి ముందే తెలుసుకోవడం మరియు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
అయితే, అటువంటి లక్షణ రహిత, ప్రాణాంతక వ్యాధులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం…
ఫ్యాటీ లివర్ డిసీజ్
కొన్నిసార్లు ఫ్యాటీ లివర్ లక్షణాలు చూపకుండా తీవ్రమవుతుంది. శరీరం అదనపు కొవ్వును కాలేయంలోనే నిల్వ చేస్తుంది. కాలేయం ఈ కొవ్వును ఫిల్టర్ చేసి బయటకు పంపలేకపోవడం వల్ల దాని పనితీరు మారుతుంది. ప్రారంభ దశలో ఇది పెద్ద ఇబ్బందిని కలిగించదు, లక్షణాలు కూడా తక్కువగా ఉంటాయి. అందువల్ల, చాలా మంది దీన్ని తేలికగా తీసుకుంటారు. అయితే, సైలెంట్‌గా దీని ప్రభావం తీవ్రతరం అవుతుంది, చివరికి కాలేయం దెబ్బతింటుంది.
నివారణ: కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించాలి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం.

గుండె సంబంధిత వ్యాధులు
తప్పు ఆహారం గుండె ఆరోగ్యానికి హానికరం. కొన్ని సందర్భాల్లో, శరీరంలో లక్షణాలు లేకుండా గుండె జబ్బులు వస్తాయి. గుండె పనితీరు పూర్తిగా మారిన తర్వాతే సమస్య గుర్తిస్తుంది. రక్తం గడ్డకట్టడం, కొలెస్ట్రాల్ పెరగడం గుండెకు సరైన ఆక్సిజన్ & రక్త సరఫరా అందకుండ ఉండటానికి కారణమవుతుంది. దీని ఫలితంగా హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)
ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సాధారణ సమస్యగా మారింది. ప్రారంభ దశలో లక్షణాలు కనపడవు, కానీ అది నిశ్శబ్దంగా రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీని ప్రభావం గుండె, మూత్రపిండాల పనితీరుపై పడుతుంది. కాబట్టి, రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అవసరం.
హెచ్‌ఐవి
హెచ్‌ఐవి ప్రారంభ దశలో సాధారణ ఫ్లూ లేదా ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది, అందువల్ల చాలా మంది దీన్ని విస్మరిస్తారు. ప్రస్తుతం, యాంటీవైరల్ చికిత్స ద్వారా వైరస్‌ను తగ్గించవచ్చు, కానీ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకూడదు.
టైప్ 2 డయాబెటిస్
ఇన్సులిన్ హార్మోన్ విడుదల తగ్గినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ప్రారంభ దశలో లక్షణాలు తక్కువగా ఉంటాయి, కానీ వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ లక్షణాలు కూడా కనిపిస్తాయి. డయాబెటిస్ అన్ని అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, కళ్ళు. కాబట్టి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం.





















