తన భర్త ఆత్మహత్యకు పలురోజులు గడిచినా, దీనికి కారణమైన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఐపీఎస్ అధికారి భార్య అమినిత్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ కేసు దర్యాప్తు దారి మళ్లించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
హర్యానా, అక్టోబర్ 09: తన భర్త మరణానికి కారణమైన వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ భార్య అమినిత్ పి. కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ కుమార్ సింగ్ సైనీకి లేఖ రాశారు. సంబంధిత ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని లేఖలో ముఖ్యమంత్రిని ఆమె కోరారు.
లేకపోతే ఈ కేసు దర్యాప్తులో వారు జోక్యం చేసుకునే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలను తారుమారు చేయవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ కేసు దర్యాప్తుపై వారు ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి వారివల్ల ముప్పు పొంచి ఉందని, బెదిరింపులు ఎదురయ్యే అవకాశముందని కూడా లేఖలో స్పష్టం చేశారు.
తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి సైనీని అమినిత్ పి. కుమార్ అభ్యర్థించారు. తన భర్త మరణించి అనేక రోజులు గడిచినా, ఆయనను వేధించిన, అవమానపరిచిన, మానసికంగా హింసించిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తన భర్త ఆత్మహత్యకు కారణమైన అధికారులు అంతా ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఆ అధికారం, శక్తిని ఉపయోగించి తనతో పాటు తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వారు ప్రయత్నించవచ్చనే ఆవేదనను వ్యక్తం చేశారు. శాఖ పరంగా కానీ, ఇతర మార్గాల్లో కానీ తనను ఇరికించే కుట్రలు చేయవచ్చనే భయాందోళనను వెల్లడించారు.
తన భర్త ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే తన కుమార్తెను ఆయన ఉన్న ప్రదేశానికి పంపినట్లు ఆమె లేఖలో వివరించారు. అక్కడకు వెళ్లిన తన కుమార్తె, ఇంటి బేస్‌మెంట్‌లో భర్త విగతజీవిగా పడి ఉన్నారని తెలిపిందని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ హర్యానా కేడర్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య అమినిత్ పి. కుమార్ కూడా అదే రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అమినిత్ పి. కుమార్ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అధికార బృందం జపాన్ పర్యటిస్తుండగా, ఆమె కూడా ఆ బృందంలో భాగమయ్యారు.
హర్యానా పోలీస్ శాఖలో పూరన్ వై. కుమార్ తీవ్ర కుల వివక్షను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పుచేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూరన్ వై. కుమార్ హర్యానాలో అడిషనల్ డీజీపీగా సేవలు అందిస్తున్నారు.




















