హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం తీవ్ర చర్చలకు వేదికైంది. కొందరు మంత్రుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా కొందరు మంత్రుల చర్యలు ఉన్నాయని, తక్షణమే తమ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఎజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన తర్వాత అధికారులను బయటకు పంపించి, మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పరిణామాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మంత్రుల మధ్య ఉన్న విభేదాలు, అలాగే ఎక్సైజ్ శాఖ వివాదం, కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారం వంటి పలు అంశాలపై సీఎం సమీక్ష చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ వీఆర్‌ఎస్ వ్యవహారంలో కేటీఆర్ కుటుంబాన్ని అనవసరంగా లాగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తాము తొందరపడ్డామని ఇద్దరూ అంగీకరించినట్లు సమాచారం.
సమావేశం అనంతరం సీఎం గట్టి సూచనలు చేయడంతో, కొండా సురేఖ మీడియా సమావేశంలో సీఎం పట్ల క్షమాపణలు చెప్పినట్లు, వివాదాలు ముగిశాయని ప్రకటించారు. జూపల్లి కృష్ణారావు కూడా రిజ్వీ వీఆర్‌ఎస్ అంశంలో తన లేఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వ్యూహాలు, బీసీ రిజర్వేషన్లు, మరియు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం చేపట్టాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.


















