పుట్టగానే నీ చెయ్యి తాకాలనుకున్నా… నీ ఒడిలో చేరి జోలపాటల మాధుర్యాన్ని ఆస్వాదించాలనుకున్నా. ప్రతి క్షణం నీతో గడపాలని, నా బుగ్గలు నిమురుతూ ప్రేమతో ముద్దుపెట్టాలని కలగన్నా. కానీ నేనొక చిన్న శిశువునిగా భూమిపై పడ్డ వెంటనే నన్ను పేడదిబ్బలో వేశావేంటి అమ్మా? నీ మమకారాన్ని ఇంతలా చంపుకోవాలనుకున్నావా?
సోమల, న్యూస్‌టుడే: పుట్టినకొద్ది సేపటికే ఓ తల్లి తన ఆడబిడ్డను పేడదిబ్బలో పడేసి వెళ్లిపోయిన విషాద ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలం ఎస్.నడింపల్లె పంచాయతీ ఎర్రంవారిపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం, గ్రామానికి సమీపంలో వెళ్తున్న గిరిజన మహిళ చంద్రకళకు పేడదిబ్బ వైపు నుంచి శిశువు ఏడుపు వినిపించింది. ఆమె వెళ్లి చూడగా, అప్పుడే పుట్టిన ఆడబిడ్డ రక్తపు మడుగులో పడిఉండడం గమనించింది. వెంటనే చంద్రకళ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లి స్నానం చేయించి శుభ్రం చేసింది.
తర్వాత స్థానిక ఏఎన్‌ఎం సరస్వతి, మహిళా పోలీసు గౌతమి, అంగన్‌వాడీ కార్యకర్త రెడ్డికుమారి, ఆశా కార్యకర్త జానకిరాణిలతో కలిసి బిడ్డను సోమల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు హరిత పర్యవేక్షణలో 108 వాహనంలో ఆ బుజ్జాయిని చిత్తూరులోని శిశువిహార్‌కు తరలించారు.



















