భారీ పేలుడు ధాటికి దేశ రాజధాని దిల్లీ కుదేలైంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా హైస్థాయి భద్రతా సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం కర్తవ్యభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, దిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూ–కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వర్చువల్‌గా సమావేశంలో చేరారు.
దిల్లీ పేలుడు, ఉగ్రవాద ముప్పులు, కాశ్మీర్ పరిణామాలపై సమీక్ష జరుగుతోందని సమాచారం. ఇప్పటికే అమిత్ షా ఘటనాస్థలాన్ని సందర్శించి, ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అదేవిధంగా దిల్లీ పోలీస్ చీఫ్, ఐబీ డైరెక్టర్‌లతో మాట్లాడి తాజా పరిస్థితిని అంచనా వేశారు.
సోమవారం సాయంత్రం చారిత్రక ఎర్రకోట సమీపంలో ఓ కారు పేలడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి వాహనాలు ధ్వంసమైపోయాయి. తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు ఎర్రకోట మెట్రోస్టేషన్‌ను భద్రతా కారణాల రీత్యా మూసివేశారు.




















