రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలను నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడ నగర హృదయభాగంలో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. 2026 చివరి నాటికి స్టేడియం అభివృద్ధిని పూర్తి చేసి, 2029లో అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర క్రీడా సంస్థ (SAAP) మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) కలిసి చేపట్టనున్నాయి.
స్టేడియం పునర్నిర్మాణానికి మొత్తం రూ.53 కోట్లు అంచనా వేయగా, మొదటి విడత పనులకు రూ.30 కోట్లు కేటాయించనున్నారు. ఈనెలాఖరులోపు డీపీఆర్‌ను సమర్పించనున్నారు. ఇకపై స్టేడియంలో క్రీడేతర ప్రభుత్వ లేదా ప్రైవేటు ఈవెంట్లు నిర్వహించబోరని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలు
- ప్రస్తుత SAAP ప్రధాన కార్యాలయాన్ని తొలగించి, అక్కడ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ప్రాక్టీస్ ఏరియా, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మరియు కమర్షియల్ హాల్ నిర్మాణం.
- అదనంగా టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ కోసం ఔట్‌డోర్ కోర్టుల ఏర్పాటు.
- క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విభాగం అభివృద్ధి.
- 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం, ట్రాక్ మధ్యలో ఫుట్‌బాల్ గ్రౌండ్ ఏర్పాటు.
- గ్యాలరీలతో అనుసంధానంగా కొత్త భవనం నిర్మాణం, భవనంలో సింథటిక్ వార్మప్ ట్రాక్, క్రీడాకారుల కోసం వసతి, డార్మేటరీ, కిచెన్ సదుపాయాలు.
- ప్రధాన గ్యాలరీల కింద ఉన్న గదుల ఆధునీకరణ.
ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే, రాష్ట్రం అంతర్జాతీయ క్రీడా మ్యాప్‌లో మరింత గుర్తింపు పొందే అవకాశముందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.



















