దిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్ అసోసియేట్స్‌ను కొనుగోలు చేసే నిమిత్తం నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ పవర్‌కు సూత్రప్రాయ అనుమతులు ఇచ్చినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న జైప్రకాశ్ అసోసియేట్స్ దివాలా పరిష్కార ప్రక్రియలో విజయవంత బిడ్డర్‌గా నిలిస్తే ఇది సాధ్యమవుతుంది. జైప్రకాశ్ అసోసియేట్స్‌ను కొనేందుకు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, అదానీ గ్రూపు, దాల్మియా భారత్ ప్రతిపాదనలకూ సీసీఐ ఆమోదం తెలిపింది.
జై ప్రకాశ్ అసోసియేట్స్ కోసం వివిధ కంపెనీలు సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికలపై రుణసంస్థల కమిటీ సమీక్ష జరుపుతోంది. నిర్ణీత సమయంలో దీనిపై ఓటింగ్‌ను అవి నిర్వహిస్తాయి. జై ప్రకాశ్ అసోసియేట్స్ నుంచి రూ.57,185 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని రుణ సంస్థలు చెబుతున్నాయి. జై ప్రకాశ్ అసోసియేట్స్ దివాలా ప్రక్రియకు 2024 జూన్ 3న నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. రుణ సంస్థల కమిటీకి దివాలా పరిష్కార ప్రణాళికను సమర్పించే నిమిత్తం సీసీఐ అనుమతి కోసం వేదాంతా గ్రూపు సహా మరికొన్ని కంపెనీలు కూడా ప్రతిపాదనలు సమర్పించాయి.


















