కాచిగూడ: బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని బీసీ ఐకాస్ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
గురువారం హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీలం వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, సంఘాల నేతలు రాజేందర్, రాందేవ్ మోదీ, రాజ్‌కుమార్, భీమ్‌రాజ్, శివకుమార్ యాదవ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.
రిజర్వేషన్ల కోసం 60 బీసీ సంఘాలు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశాయని, వీటిని సమగ్రంగా పరిశీలిస్తే తీర్పు బీసీలకు అనుకూలంగా రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా న్యాయ సాధన దీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే, వచ్చే ఏడాది జనవరిలో నగరంలో ప్రధాన మంత్రి మోదీతో భారీ బహిరంగ సభ నిర్వహించే ఏర్పాటు ఉందని ప్రకటించారు.


















