ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తూ నీటి పారుదల శాఖ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్డీఎస్‌యే దర్యాప్తు ఆధారంగా డిజైన్లు రూపొందించాలని పేర్కొంది. ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీ సంస్థలు ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పరిశీలిస్తారు. వచ్చిన డిజైన్లను ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో పెట్టనుంది. డిజైన్ల కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానించాలని నీటిపారుదల శాఖ గత నెల 19నే ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే మంత్రి ఉత్తమ్ సైతం అధికారులను ఈ మేరకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించడానికి అధికారులు అవకాశం కల్పించారు.
2023 అక్టోబరులో కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో పియర్స్ కుంగాయి. అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడ్డాయి. పునరుద్ధరణకు ఎన్డీఎస్‌యే సహాయం కోరగా పలు సూచనలను చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకుని పునరుద్ధరించాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. మొదట ఐఐటీ రూర్కీ నుంచి డిజైన్లు తీసుకోవాలని ప్రాథమికంగా భావించింది. తర్వాత అధికారులు పునరాలోచనలో పడ్డారు. మేడిగడ్డ పియర్స్ కుంగినప్పుడు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ.. ఐఐటీ రూర్కీతోనే అధ్యయనం చేయించింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఎన్డీఎస్‌యే నిరాకరించింది. దాంతో నీటిపారుదల శాఖ ఇప్పుడు వెనక్కి తగ్గింది. డిజైన్ల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించిన సీడీవో ఆసక్తి వ్యక్తీకరణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.


















