కేరళలో నిర్మించిన దక్షిణ భారతంలోనే అతిపెద్ద సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ త్వరలో అధికారికంగా ప్రారంభం కానుంది. కాసర్‌గోడ్ జిల్లా తలాపాడి-చెంగాలా జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది. ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతానికి ప్రతీకగా నిలిచే ఈ పైవంతెన కరంథక్కడ్-నుల్లిపడి మధ్య ఉంది. 1.16 కి.మీ పొడవు, 5.5 మీటర్ల ఎత్తు, 27 మీటర్ల వెడల్పుతో రూపొందించిన ఈ ఫ్లైఓవర్ దక్షిణ భారతంలోనే అత్యంత విశాలమైన సింగిల్ పిల్లర్ పైవంతెనగా నిలిచింది. 30 భారీ సింగిల్ పిల్లర్లపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను ఉరలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేసింది.




















