తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి.. సూర్యచంద్రుల వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు రాత్రి అమృత కిరణాలు గల చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల తొలినాళ్లలో స్వామివారు పశుపక్ష్యాదులను, దాసులను వాహనాలుగా మలుచుకోగా.. ఏడోరోజు సూర్యచంద్రాదులను అధిష్ఠించి భక్తకోటిని కటాక్షించారు. సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఉదయం వాహనసేవలో పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని హారతులు సమర్పించారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు రంగనాయకుల మండపంలో రెండో పర్యాయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి.. నవనీత కృష్ణుడి అలంకరణతో కనువిందు చేశారు. వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో మురళీకృష్ణ, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
నేడు రథోత్సవం: ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం రథోత్సవం జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష సమర్పణ చేసి, ఉదయం 7 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాహన సేవల్లో చివరగా అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. గురువారం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ఉత్సవాల ముగింపుగా ‘చక్రస్నానం’ క్రతువు జరగనుంది.


















