దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు. శుక్రవారం రాత్రంతా ఆయన విమానాశ్రయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. నిన్న బెంగళూరు విమానాశ్రయంలో కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం దిల్లీ చేరుకున్న ఆయన, అర్ధరాత్రి వరకు ఏటీసీ అధికారులతో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
ఇటీవల హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో, ఇవాళ ఉదయం నుంచే రామ్మోహన్ నాయుడు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఎయిర్పోర్టు అథారిటీ, డీజీసీఏ, విమానాశ్రయ అధికారులతో సమగ్రంగా చర్చలు జరుపుతున్నారు. దిల్లీతో పాటు అనేక ప్రాంతాల్లో సమస్యలు కొనసాగి విమానాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో, రామ్మోహన్ నాయుడు తన మాల్దీవుల పర్యటనను రద్దు చేశారు.



















