విశాఖపట్నం :
మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ నేతలతో కూటమి తరహాలో వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల వనభోజనాల సన్నాహక సమావేశంలో మంత్రి సుభాష్ వైసీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, మహిళా నాయకులను మంత్రి సుభాష్ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాకుండా, వనభోజనాల కమిటీకి వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణను అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు టీడీపీపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, మంత్రి సుభాష్ వారిని ప్రశంసించడం టీడీపీ నాయకుల ఆగ్రహానికి గురయ్యింది.
“మా నాయకుడిని మీరు తిట్టండి, మీ నాయకుడిని మేము తిడతాం… బయట అందరం కలిసుండాలి” అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత వివాదాస్పదమయ్యాయి. “మంత్రి రాష్ట్రానికి మంత్రా? లేక శెట్టిబలిజ వర్గానికేనా?” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో పెడనలో వైసీపీ నేతలతో వేదిక పంచుకున్న ఇద్దరు టీడీపీ నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న విషయం గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మంత్రి సుభాష్ వైసీపీ నేతలను ప్రశంసించడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.




















