బిహార్ రాజకీయాల్లో ఊహాగానాలకు తెరపడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో ఎలాంటి సీటు ఖాళీగా లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధానిగా కొనసాగుతారని స్పష్టంచేశారు. బిహార్‌లోని దర్భంగాలో జరిగిన భారీ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, ఎన్డీయే నేతృత్వంపై విపక్షాలు రేపుతున్న సందేహాలకు చెక్ వేశారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బిహార్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ఎన్డీయే, మరోవైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ అధికార పోరులో నిమగ్నమై ఉన్నాయి. తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విపక్ష కూటమిపై, ఎన్డీయే అభ్యర్థి ఎవరు అన్న చర్చ కొనసాగుతోంది. దీనిపై మోదీ ఇప్పటికే స్పందించి ‘‘మేము నీతీశ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం’’ అని చెప్పారు. తాజాగా అమిత్ షా కూడా అదే మాటను పునరుద్ఘాటించారు.
అమిత్ షా మాట్లాడుతూ, ‘‘ప్రధాని మోదీ బిహార్ గౌరవాన్ని పెంచారు. మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రజలకు గౌరవం కలిగించారు’’ అని అన్నారు.
అలాగే పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ‘‘ఆ దాడి జరిగిన వెంటనే మోదీ గారు ఆపరేషన్ సిందూర్ ఆదేశించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడదు’’ అని చెప్పారు.
అమిత్ షా వ్యాఖ్యలతో బిహార్‌లో ఎన్డీయే సీఎం అభ్యర్థిపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. నీతీశ్ కుమార్ నేతృత్వంలోనే బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తామనే సంకేతం స్పష్టమైంది.




















