ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మొంథా తుపానుతో దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కాలువను ఆయన శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిపుణులతో కలిసి జంట సొరంగాల్లోకి చేరిన నీటి స్థితిని పరిశీలించి, నల్లమలలో కురిసిన వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తి కాలువకు గండి పడిందని గుర్తించారు. నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని మంత్రి ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తికాకముందే మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారు. జగన్ పాలనలో నిర్వాసితులకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదు. అయితే, చంద్రబాబు నాయుడు హయాంలో రూ.1,373 కోట్లు మంజూరు చేసి అందులో రూ.1,319 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఫీడర్ కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.456 కోట్లు కేటాయించి టెండర్ ప్రక్రియను పూర్తిచేశాం. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి” అని వివరించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెం తెదేపా నాయకుడు ఎరిక్షన్‌బాబు, ఇరిగేషన్ శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, సీఈ శ్యాంప్రసాద్, సీడీ సీఈ విజయభాస్కర్, ఎస్ఈ అబూతలీం, ఈఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



















