కొన్ని తినుబండారాలు నూనె ఎక్కువ పీల్చుకుంటాయి. నూనెను వీలైనంత తగ్గించమని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో నూనె అసలే వాడకుండా కబాబ్ ఎలా చేయాలో తెలుసుకుందాం…
కావలసినవి : ఉడికించిన నల్ల శనగలు – కప్పు, స్వీట్ కార్న్ గింజలు – పావు కప్పు, ఉల్లి తరుగు – ముప్పావు కప్పు, వెల్లుల్లి తరుగు – చెంచా, కొత్తిమీర తరుగు – గుప్పెడు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం – చెంచా చొప్పున, ఉప్పు – రుచికి తగినంత, నిమ్మరసం – రెండు చెంచాలు
తయారీ: స్వీట్ కార్న్ గింజలను ఉడికించాలి. వెడల్పాటి పాత్రలో ఉడికించిన శనగలు వేసి మెత్తగా మెదపాలి. అందులో ఉల్లి, వెల్లుల్లి తరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, స్వీట్ కార్న్ జోడించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న భాగాలుగా విడగొట్టాలి.. ఒక్కోదాన్ని కొంచెం అదిమి.. కబాబ్ ఆకృతినివ్వాలి. అన్నీ అయ్యాక.. నాన్ స్టిక్ ప్యాన్ మీద బంగారు రంగులోకి మారేవరకూ వేగనివ్వాలి. తర్వాత తిరగేసి.. రెండో వైపు వేయించాలి.




















