అవి నాలుగు రాష్ట్ర కార్యాలయాలు. ప్రతి ఉద్యోగి 10:30 గంటలకు విధులకు రావాల్సిన నిబంధన ఉండగా, 11 గంటలయినప్పటికీ 60 శాతం మంది హాజరు కాలేకపోయారు. ఇది రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి వచ్చింది. ఉదయం 10:40 గంటలకు మంత్రి హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్‌ను, ఆ తర్వాత శాసనసభ ఎదురుగా ఉన్న హైదరాబాద్ సహకార సంఘం (హాకా), విత్తన అభివృద్ధి సంస్థ, విత్తన ప్రాధికార సంస్థలను తనిఖీ చేశారు. ఉన్నతాధికారులతో పాటు కిందస్థాయి ఉద్యోగులు కూడా సీట్లలోకి రాలేదు. పొరుగు సేవల సిబ్బంది మాత్రం ఎక్కువగా కనిపించగా, మొత్తం 80 మందిలో కేవలం 32 మంది మాత్రమే హాజరయ్యారు; 48 మంది రాకపోవడం స్పష్టమైంది. ఈ పరిస్థితిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు సేవల సిబ్బంది సమయపాలన పాటిస్తున్నా, జనరల్ మేనేజర్, మేనేజర్ స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని అన్ని శాఖల కమిషనర్లు, ఎండీలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

















