- పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి దారి చూపే ప్రణాళికలు
- పల్లె పండగ 2.0 సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు మార్గదర్శక సూచనలు
పల్లె పండగ విజయం ఇచ్చిన ప్రేరణను కొనసాగిస్తూ, పల్లె పండగ 2.0లో రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే విధమైన ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0 ప్రారంభానికి ముందు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రహదారుల అభివృద్ధి, కొత్త రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణం వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.
సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఒ.ఎస్.డి. శ్రీ వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ శ్రీ బాలు నాయక్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



















