భారత్ 2029 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడమే లక్ష్యం. ఇందుకు కీలక రంగాల్లో ప్రైవేటు రంగానికి అవకాశాలు ఇవ్వడం అవసరమని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా, భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అణు విద్యుత్తు రంగంలో ప్రైవేటు ప్రవేశానికి కేంద్రం దారులు తెరవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అణు ఇంధనం, రియాక్టర్లు, ప్లాంట్ నిర్మాణం, నిర్వహణ—అన్నీ ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గతేడాది ప్రభుత్వం దేశంలో తొలి ప్రైవేటు అణు విద్యుత్తు టెండర్‌ను విడుదల చేసింది. స్మాల్ మాడ్యూలార్ రియాక్టర్ల (SMR) రూపంలో ప్రైవేటు రంగం తమ అవసరాలకు అణు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ టెండర్‌లో ఇవ్వబడింది. 220 మెగావాట్ల సామర్థ్యం గల ‘భారత్ స్మాల్ రియాక్టర్లు’ ఏర్పాటు కోసం JSW ఎనర్జీ, టాటా పవర్, అదానీ, రిలయన్స్ వంటి సంస్థలు ఆసక్తి చూపినప్పటికీ, అధిక ప్రాజెక్టు వ్యయం, సర్వీసు ఛార్జీలు, రిస్క్ షేరింగ్‌పై స్పష్టత లేకపోవడం వల్ల తరువాత వెనక్కి తగ్గాయి.
అదనంగా, అణు విద్యుత్తు ప్రాజెక్టులకు భూసేకరణ, అనుమతులు, ప్రాజెక్టు పూర్తికావడానికి పడే సమయం— ఇవన్నీ పెద్దసవాళ్లుగా మారాయి. పైగా, 1962 అణు ఇంధన చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థలు అణు కేంద్రాలను నిర్మించడం లేదా నిర్వహించడం చట్టబద్ధం కాదు. అందువల్ల చట్ట సవరణలు తప్పనిసరి అయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో అటామిక్ ఎనర్జీ బిల్–2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనితో పాటు న్యూక్లియర్ నష్టం బాధ్యత చట్టంలోనూ మార్పులు చేయాలనే ఆలోచన ఉంది. దేశ అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల నుంచి 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడం ప్రభుత్వ లక్ష్యం.
ఎన్టీపీసీ ఇప్పటికే అణు విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టగా, రాజస్థాన్‌లో 2.8 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రైవేటు రంగం భాగస్వామ్యం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
అణు విద్యుత్తులో ప్రైవేటు భాగస్వామ్య ప్రతిపాదన ఆసక్తికరమైనదైనా, అమల్లో ఇంకా పలుసవాళ్లు ఎదురవుతున్నాయి.




















