శ్యామ్ మెటాలిక్స్ & ఎనర్జీ లిమిటెడ్ (SMEL) మేనేజింగ్ డైరెక్టర్ షీజిత్ అగర్వాల్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మెటల్స్, ఎనర్జీ రంగాల్లో విజ్ఞానంతో ముందంజలో ఉన్న శ్యామ్ మెటాలిక్స్… రూ.30,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా నిపుణులైన సిబ్బందిని కలిగి ఉంది. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో స్టీల్, అల్యూమినియం ఫ్లాట్ ప్రొడక్ట్స్, ఫెర్రో అల్లాయ్స్, పవర్ జనరేషన్ యూనిట్లతో ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌లను నిర్వహిస్తోంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనే సంస్థ ప్రధానంగా దృష్టిసారిస్తోంది.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఎపిలో వ్యాల్యూయాడెడ్ డౌన్ స్ట్రీమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ స్థాపనను పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి స్థాయి అనుకూల వాతావరణం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ₹1.35 లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు విస్తారంగా ఉన్నాయని పేర్కొన్నారు.
“రాబోయే అయిదేళ్లలో మా సంస్థను ₹2,500 కోట్లతో విస్తరించాలని ప్రణాళిక చేస్తున్నాం. ఎపి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పూర్తిగా పరిశీలిస్తాం” అని శ్యామ్ మెటాలిక్స్ ఎండి షీజిత్ అగర్వాల్ తెలిపారు.




















