ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్జాపుర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొనడంతో ఆరుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానాలు చేయడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసి వెళ్తున్న యాత్రికులు ఈ దుర్ఘటనకు గురైనట్లు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యాత్రికులు చోపాన్–ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లో చునార్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ప్లాట్‌ఫామ్ వైపు కాకుండా ఎదురుప్రక్కనున్న పట్టాల వైపు దిగారు. అక్కడి నుంచి మరోవైపు ఉన్న ప్లాట్‌ఫామ్ చేరడానికి ప్రయత్నిస్తున్న సమయంలో హౌరా–కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది.
ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రక్షణ మరియు సహాయక చర్యలు వేగంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.




















