వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ పురందేశ్వరి
రాజమహేంద్రవరం: సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి దసరా పర్వదినాల్లో విమాన సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మూడు నెలలపాటు ప్రతి సర్వీసుకూ తొలి 35 బుకింగ్‌లకు రూ.1,999, తర్వాత 35 బుకింగ్‌లకు రూ.4,000 చొప్పున టికెట్ ధర నిర్ణయించామన్నారు. విమాన సర్వీసును ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి దిల్లీ నుంచి వర్చువల్‌గా బుధవారం కేంద్రమంత్రి ప్రారంభించారు. విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో తిరుపతిలో ఉదయం 7.40కు ప్రారంభమై 9.25కు రాజమహేంద్రవరం చేరుకుంటుంది. తిరిగి ఇక్కడ నుంచి 9.50 గంటలకు తిరుపతికి బయలుదేరుతుంది.



















