దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, మదుపర్ల కొనుగోళ్లు సూచీలకు ఊతమిచ్చాయి. ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగబాకి 82,350, నిఫ్టీ 102 పాయింట్లు పెరిగి 25,247 వద్ద ట్రేడవుతున్నాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ₹88.27 వద్ద నిలిచింది.
నిఫ్టీ సూచీలో జియో ఫైనాన్షియల్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఆసియన్ పెయింట్స్ లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్ స్టాక్స్ స్వల్ప నష్టాలు నమోదు చేశాయి.
మంగళవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గత నెల డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.13% వద్ద నిలవడం సానుకూల భావనకు దోహదమిచ్చింది. దేశీయంగా కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి.





















