ఆమదాలవలస గ్రామీణం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ మస్కట్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఆమదాలవలస మండలం వెదుళ్లవలసకు చెందిన సవలాపురపు నాగమణి మస్కట్‌లో మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఆమె మృతిపై తల్లి సరోజిని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత నాలుగేళ్లుగా మస్కట్‌లో నాగమణి పనిచేస్తోందని ఆమె తల్లి తెలిపారు. ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. ఇటీవల నాగమణి ఇంటికి వచ్చి నాలుగు నెలల క్రితం తిరిగివెళ్లినట్లు వివరించారు. పని ప్రదేశంలో గత మూడు రోజులుగా తీవ్ర వేధింపులకు గురవుతున్నట్లు ఆమె చెప్పిందని.. స్వస్థలానికి వచ్చేస్తానని తెలిపిందన్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదని.. అక్కడి ఏజెంట్ ఫోన్ చేసి నాగమణి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడితో ఆయన ఫోన్‌లో మాట్లాడి మృతదేహం ఇక్కడికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారని సరోజిని తెలిపారు




















