తెలంగాణలో భారీ డేటా హ్యాకింగ్ ఘటన వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల సమాచారం సైబర్ కేటుగాళ్ల చేతిలో పడింది. తాజా సమాచారం ప్రకారం ఆరోగ్యశ్రీ, ధరణి, మీ సేవ, జీహెచ్ఎంసీ వంటి కీలక విభాగాలకు చెందిన డేటా డార్క్ వెబ్ సైట్లలో ప్రత్యక్షమైంది.
మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన రహస్య సమాచారం హ్యాక్ చేయబడిందని, ఆ డేటాను ఇంటర్నెట్‌లో విక్రయానికి పెట్టినట్లు తెలిసింది. ఈ హ్యాకింగ్ గురించి సంబంధిత ప్రభుత్వ విభాగాలు ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం.
సైబర్ నిపుణుల ప్రకారం, భద్రతా లోపాలు ఉన్న విభాగాలను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా, పోలీసులు మాత్రం “డేటా చోరీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదు” అని వెల్లడించారు.
రాష్ట్రంలోని డిజిటల్ సెక్యూరిటీ వ్యవస్థలపై ఈ ఘటన ప్రశ్నార్థక చిహ్నం వేసింది. ప్రజల వ్యక్తిగత సమాచారం రక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.




















