తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46లోని రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని వెనుకబడిన వర్గాల సంఘాలు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలను ఏ, బి, సి, డి వర్గాలుగా విభజించి రిజర్వేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ దశలో స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎందుకు సవాల్ చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించగా, కేసు తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.


















