కేంద్రానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి
విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: విదేశీ విద్యార్థుల పాస్‌పోర్ట్ సేవలను వేగవంతం చేయడంతో పాటు కడపలో కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎన్‌ఆర్‌ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ‘విదేశీ సంపర్క్’ కార్యక్రమం విజయవాడలోని ఓ హోటల్‌లో శుక్రవారం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, విదేశాల్లో లభించే ఉపాధి అవకాశాలపై రాష్ట్రానికి నిరంతర సమాచారం అందించాలనీ కేంద్ర అధికారులను కోరారు. ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అమరావతిలో ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహించాలని ప్రతిపాదించారు.
అలాగే విదేశాంగ శాఖకు సంబంధించిన భవన సముదాయాన్ని అమరావతిలో నిర్మించడం ద్వారా ప్రజలకు అన్ని సేవలను ఒకే చోట అందుబాటులోకి తేవచ్చని తెలిపారు. విదేశాలకు వెళ్తున్నవారు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా, అదే సౌకర్యాన్ని అమరావతిలోనే కల్పించాలని సూచించారు. ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో విదేశాంగ శాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్ చటర్జీ, రాష్ట్ర సీఎస్ కె.విజయానంద్, అధికారులు ముఖేష్ కుమార్ మీనా, ఏపీ ఎన్‌ఆర్టీ సొసైటీ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎ.నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.



















