బండ్లగూడజాగీర్, న్యూస్‌టుడే: శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని సిబ్బంది ఇకమీదటా కొనసాగించాలన్నారు. మంగళవారంతో పదవీ విరమణ చేస్తున్న డీజీపీ జితేందర్ గౌరవార్థం రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి పోలీసు అకాడమీలో ఉదయం ఏర్పాటుచేసిన వీడ్కోలు పరేడ్‌లో పాల్గొన్నారు. గత 15 నెలల కాలంలో డీజీపీగా శాంతిభద్రతలను అదుపులోకి తీసుకువచ్చినట్లు, నేరాలను గణనీయంగా తగ్గించినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నియంత్రణకు నిరంతరం యుద్ధం చేస్తున్నామని, బెట్టింగ్ మాఫియాపై లోతైన దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్టు ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారని, రాష్ట్రం 10 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని, సంచలనం సృష్టించిన కేసులను కేవలం 48 గంటల వ్యవధిలోనే ఛేదించినట్లు వెల్లడించారు.
డీజీపీ కార్యాలయంలో..
కార్యక్రమంలో జితేందర్ పూలతో అలంకరించిన వాహనంపై నిలబడగా అధికారులంతా వాహనాన్ని ఇరువైపులా తాడుతో లాగుతూ కార్యాలయం వెలుపలి వరకూ తీసుకువెళ్లారు.
సీవీఆనంద్ బాధ్యతల స్వీకరణ
హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ హైదరాబాద్ కమిషనర్‌గా ఆయన పనిచేశారు.


















