అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న బస్సులపై భారీ ఎత్తున కేసులు నమోదు చేశారు.
నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు మొత్తం 371 కేసులు నమోదు కాగా, 66 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని ట్రావెల్స్‌పై అధికారులు రూ.7.12 లక్షల జరిమానాలు వసూలు చేశారు. అత్యవసర ద్వారాలు తెరుచుకోకుండా ఉన్న 23 బస్సులపై, అగ్ని ఆర్పే సిలిండర్లు లేని 79 బస్సులపై, ఫైర్ అలారం వ్యవస్థ లేని 18 బస్సులపై కేసులు నమోదు చేశారు.
అదే విధంగా, సీటింగ్ అమరికల్లో అనధికార మార్పులు చేసిన 42 బస్సులపై కూడా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే, ఎన్టీఆర్ జిల్లాలో 61, కర్నూలులో 37, పల్నాడులో 17, నంద్యాలలో 14, తిరుపతిలో 14 కేసులు నమోదయ్యాయి.
మూడు రోజులుగా జరుగుతున్న ఈ డ్రైవ్‌లో అధికారులు ఇప్పటివరకు మొత్తం 120 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రత కోసం ఈ చర్యలు కొనసాగుతాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు.



















