ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: కలప రవాణాను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ సిస్టం’(ఎన్‌టీపీసీ)… అక్రమార్కులకు వరంగా మారింది. టేకు లాంటి విలువైన కలప మినహా మిగిలిన రకాలను సులువుగా రవాణా చేసేందుకు వీలు కల్పించే విధానమిది. వ్యాపారి ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి, కలప వివరాలు, చెట్లు విస్తరించిన సర్వే నంబర్లను పొందుపరచాలి. సరకు, దరఖాస్తును అటవీ అధికారులు తనిఖీ చేసి ఎన్‌వోసీ ఇస్తారు. ఇందులో లొసుగులను ఆసరా చేసుకుని ఖమ్మం జిల్లా నుంచి సాధారణ కలప మాటున విలువైన కలపను పలు రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న విషయం తాజాగా వెలుగుచూసింది.
ఇదీ జరిగింది…
ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు గత జులై 9 నుంచి ఓ వ్యాపారి కలపను తరలిస్తున్నాడు. ఒక్కో లారీలో 18 నుంచి 20 క్యూబిక్ మెట్రిక్ టన్నుల చొప్పున 24 లోడ్లు తరలించాడు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ‘ఖైర్’(సండ్ర) కలపను పర్మిట్‌లో చేర్చి… అక్రమ రవాణా చేస్తున్నట్లు మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లా సబ్ డీఎఫ్‌ఓ రెండు రోజుల క్రితం చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. తెలంగాణ అటవీ విభాగం విజిలెన్స్ అధికారులకు తెలియజేశారు. పర్మిట్ దరఖాస్తులో వ్యాపారి పేర్కొన్న చింతకాని మండలంలో అడవులు లేకపోగా… పర్మిషన్‌లో చూపిన సర్వే నంబరులో అసలు చెట్లే లేవు. చింతకానిలో కలప కొన్నట్లు పర్మిషన్ తీసుకుని పొరుగునే ఉన్న భద్రాద్రి జిల్లా ఇల్లెందు, మహబూబాబాద్ జిల్లాల్లోని రిజర్వు ఫారెస్టు నుంచి విలువైన సండ్ర జాతి కలపను నరికి తీసుకెళ్లినట్లు అనధికారిక సమాచారం. ఈ విషయమై ఖమ్మం డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌ని సంప్రదించగా… ఉత్తరాది రాష్ట్రాలకు కలప అక్రమ రవాణాపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో అటవీ సిబ్బంది పాత్రపైనా ఆరా తీస్తున్నామన్నారు. కలప ఎక్కడి నుంచి వెళ్లిందో తెలుసుకుంటామని, అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచామని పేర్కొన్నారు.


















