అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తగా మరో రూల్ ప్రవేశపెట్టారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, ముఖ్యంగా డయాబెటిస్ మరియు ఒబెసిటీ ఉన్నవారికి అమెరికా వీసా తిరస్కరించేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఈ మార్గదర్శకాలను అమెరికా ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసింది అని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
సాధారణంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, డయాబెటిస్, ఒబెసిటీ వంటి మరిన్ని వ్యాధులను జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రభుత్వ వనరులపై ఆధారపడే అవకాశం ఉన్నవారా అని పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకుంటారని అర్థమవుతుంది.
మార్గదర్శకాల ప్రకారం, వీసా అధికారులు దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిశీలించాలి. హృద్రోగాలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సంరక్షణ అందించేందుకు పెద్ద ఆర్థిక వ్యయం అవసరం. ఒబెసిటీ ఉన్నవారిలో ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం కాబట్టి, వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలి. అవసరమైతే వీసా తిరస్కరించాలి.
తద్వారా, వలసదారులు అమెరికా ప్రభుత్వ సహాయం లేకుండా వైద్య చికిత్సను స్వయంగా భరించగలరా, కుటుంబసభ్యుల ఆరోగ్యం కూడా సరిచూడాలి వంటి అంశాలను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అయితే ఈ మార్గదర్శకాల అమలు విధానం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించబడలేదు.
ఇప్పటివరకు అమెరికా వలసదారుల కోసం కఠిన విధానాలను అమలు చేస్తున్నది తెలిసిందే. ఉదాహరణకు, విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు ఉన్న ‘డ్యురేషన్ ఆఫ్ స్టే’ పరిమితులు, హెచ్-1బీ వీసాల రుసుములను లక్ష డాలర్ల వరకు పెంచడం వంటి నిర్ణయాలు వలసదారులను ఆందోళనలో పెట్టాయి.




















