అలహాబాద్: సమీప బంధువైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. తన భార్యను హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఘటనలో దోషికి 43 ఏళ్ల తర్వాత శిక్షపడింది. ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా పేర్కొనగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆ తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ రాజీవ్ గుప్తా, జస్టిస్ హరవీర్ సింగ్‌ల ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పులోని లోపాలను గుర్తించి తాజా నిర్ణయాన్ని వెలువరించింది. అవదేశ్‌కుమార్.. 1982 ఆగస్టు 6న తన భార్య కుసుమ దేవికి దెయ్యం వదిలించే పేరుతో ఆమెను హత్య చేశాడు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని ట్రయల్ కోర్టు అనవసరపు సందేహాలతో కొట్టిపారేసిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు నమోదు చేసిన సాక్ష్యాల ఆధారంగానే నేరనిర్ధారణకు వస్తున్నట్లు సెప్టెంబరు 25న వెలువరించిన తీర్పులో వెల్లడించింది. హంతకుడికి, అతనికి సహకరించిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష, జరిమానా విధించింది.

















