కెరమెరి, న్యూస్‌టుడే: అడవి పందులు పంటలను ధ్వంసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మధుకర్, బాధితులు తెలిపిన ప్రకారం… మండలంలోని తుమ్మగూడకు చెందిన చవాన్ అరవింద్(34) తనకున్న ఆరు ఎకరాలలో పత్తి, కంది పంటలు వేశారు. మంగళవారం చేనుకు వెళ్లిన అతను… పంటలు ధ్వంసమై ఉండటాన్ని చూసి హతాశులయ్యారు. రెండు, మూడు రోజుల నుంచి అడవి పందులే ఇలా చేస్తున్నాయని భావించారు. మనస్తాపంతో చేనులోనే పురుగుమందు తాగారు. కుటుంబీకులు మొదట ఆసిఫాబాద్ ఆసుపత్రికి, తర్వాత మంచిర్యాలకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు. అరవింద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.




















