కర్నూలు, అక్టోబర్ 27: కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తీవ్రంగా స్పందించారు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ పద్ధతి అని ఆయన మండిపడ్డారు.
ఆలపాటి రాజా మాట్లాడుతూ, “ఇంత పెద్ద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన సమయంలో, వైసీపీ మాత్రం దుష్ప్రచారమే చేస్తోంది. ప్రజల బాధను రాజకీయ లాభాల కోసం వాడుకోవడం అమానుషం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, సాక్షి మీడియా సహా కొన్ని వైసీపీ అనుబంధ మీడియా సంస్థలు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని, వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న మీడియా సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
“ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలు ముఖ్యమని భావించే వైసీపీ మానసికతను ప్రజలు గమనిస్తున్నారు. ఈ దుర్ఘటనను కూడా రాజకీయంగా మలచే ప్రయత్నం దారుణం,” అని ఆలపాటి రాజా అన్నారు.




















