వలసలకు వ్యతిరేకంగా లండన్‌లో తాజాగా జరిగిన భారీ ర్యాలీలో వర్చువల్‌గా ప్రసంగించిన టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరగబడి పోరాడకపోతే మరణం తప్పదని ర్యాలీకి వచ్చిన వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యునైట్ ది కింగ్‌డమ్ పేరిట ఈ ర్యాలీ జరిగింది. ఉత్తర అమెరికా, ఐరోపాకు చెందిన పలువురు వలసల వ్యతిరేకవాదులు ఈ ర్యాలీలో పాల్గొని నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిటన్‌కు చెందిన కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఏకంగా 1.5 లక్షల మంది పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. ‘మీరు చాలా మౌలికమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. వామపక్షాలు అంటేనే హత్యల పార్టీలు. వాళ్లు ఓ మరణాన్ని వేడుకలా చూస్తున్నారు. మీరు హింసకు వ్యతిరేకమైనా హింసాత్మక ఘటనల బారినపడక తప్పదు. మీరు తిరగబడకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటారు’ అని మస్క్ హెచ్చరించారు. మస్క్‌తోపాటు ఫ్రాన్స్‌కు చెందిన ఎరిక్ జెమ్మోర్, జర్మనీ(ఏఎఫ్‌డీ)కి చెందిన వలస విధానాల వ్యతిరేకి పీటర్ బైస్ట్రోన్ కూడా ఈ ర్యాలీలో ప్రసంగించారు. అమెరికాలో చార్లీ కిర్క్ హత్య గురించి ప్రస్తావించారు. ఐరోపాలో తెల్లజాతీయులను ఇతర దేశాల నుంచి వలసొచ్చిన వారు భర్తీ చేస్తున్నారన్న వాదనను ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ పరిణామాలపై అక్కడి విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలను వ్యతిరేకిస్తూ ఈ స్థాయిలో ర్యాలీలో పాల్గొనడం ఇదే తొలిసారని అన్నారు. వివిధ దేశాలకు చెందిన సంప్రదాయవాదులు అనేక మంది ఈ ర్యాలీలో పాల్గొనడాన్ని ప్రస్తావించారు. యునైట్ ది కింగ్‌డమ్ ర్యాలీకి సమీపంలోనే మరికొందరు జాత్యాహంకారాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు తెరతీశారు. ఇది చివరకు ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. సుమారు 25 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు సుమారు 26 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. ఈ పరిణామాలను యూకే అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ ఖండించారు. హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


















