బెలెమ్: బ్రెజిల్‌లోని బెలెమ్‌లో నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ – 30 (కాప్) సదస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. వివిధ దేశాలు నెలకొల్పిన పెవిలియన్లు, మీడియా సెంటర్ ఉన్న ‘బ్లూ జోన్’లో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైక్రోవేవ్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 19 మంది దట్టమైన పొగ పీల్చడంతోనే అస్వస్థతకు గురైనట్లు వివరించారు. వారిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రమాద సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అక్కడే ఉన్నారు. యూఎన్ భద్రతా రక్షణ అధికారులు గుటెరస్‌తో పాటు మిగిలిన వారిని బయటకు తరలించారు. ఈ సదస్సుకు భారత్ తరఫున హాజరైన పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సురక్షితంగా బయటపడినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.




















