సింగరాయకొండ (ప్రకాశం జిల్లా): సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి కొద్ది నిమిషాల్లోనే పరిశ్రమ అంతటా వ్యాపించాయి. కర్మాగారంలో నిల్వ ఉంచిన పొగాకు, యంత్ర సామగ్రి మంటల్లో ఆవిరైపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని ఈ పరిశ్రమను నిర్వహిస్తోంది. భారీ మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లను ఖాళీ చేసి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం సమయంలో అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. అయితే, పరిశ్రమలో నిల్వ ఉంచిన పొగాకు, యంత్ర పరికరాలు, భవన నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయి.
ఈ అగ్నిప్రమాదం వల్ల సుమారు రూ.500 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నికి గల కారణాలు, నష్టపరిహారం వివరాలపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పరిశీలించి, అవసరమైన నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.



















