విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన 15 నెలల్లోనే విశాఖకు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు
అమరావతి: విశాఖ నగరానికి మరొక గౌరవం చేరబోతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ పెట్టుబడిని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించింది. టీసీఎస్ విశాఖలో నిర్మించిన డెవలప్‌మెంట్ సెంటర్‌ను వచ్చే నెలలో ప్రారంభించనుండగా, అదే సమయంలో డేటా సెంటర్ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబును కలిసి ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు సమాచారం.
రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ కంపెనీలు మొత్తం రూ.2.6 లక్షల కోట్లకు పైగా విశాఖలో పెట్టుబడులు పెట్టనున్నాయి. డేటా సెంటర్లతో నేరుగా లభించే ఉద్యోగాల కంటే పరోక్షంగా దాదాపు పది రెట్ల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏఐ నగరంగా విశాఖ
డేటా సెంటర్ల స్థాపనతో విశాఖపట్నం త్వరలోనే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హబ్‌గా అవతరించనుంది. వీటి ఆధారంగా ఏఐ స్టార్టప్‌లు, ఏఐ ఆధారిత టెక్ కంపెనీలు విశాఖ వైపు ఆకర్షితమవుతున్నాయి. డేటా సెంటర్లు అందుబాటులోకి రావడంతో హైస్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, క్లౌడ్ రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. ఈ రంగాల్లోని ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, మెటా వంటి ప్రముఖ కంపెనీలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ప్రపంచ డేటా హబ్‌గా ఎదుగుతున్న విశాఖ
అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌గా 1,000 మెగావాట్ల సామర్థ్యంతో రూ.56,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. నవంబర్‌లో దీనిపై అధికారిక ఒప్పందం కుదుర్చుకోనుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా రూ.87,520 కోట్లతో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇటీవల మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సిఫీ టెక్నాలజీస్ రూ.16,000 కోట్లతో డేటా సెంటర్ నిర్మించనుండగా, మెటా సంస్థ సముద్రగర్భ సబ్‌మెరైన్ కేబుళ్ల ల్యాండింగ్ హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుంది.
ఈ భారీ ప్రాజెక్టులతో ఏఐ, క్వాంటమ్, బ్లాక్‌చైన్ వంటి ఆధునిక టెక్నాలజీలలో విశాఖ భవిష్యత్ గ్లోబల్ సెంటర్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టెక్నాలజీ ఉపాధికి కేంద్రం
టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం రూ.1,400 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వం కేటాయించిన 22 ఎకరాల్లో సొంత క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 12,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అదేవిధంగా కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు మరో 25,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. సత్వా, ఏఎంఎన్‌ఎస్ ప్రాజెక్టుల ద్వారా మరో 15,000 మందికి ఉద్యోగాలు సృష్టించే అవకాశముంది.
15 నెలల్లో పెట్టుబడుల వెల్లువ
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లోనే విశాఖకు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగింది. ఎన్టీపీసీ రూ.2 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్ధి చేస్తుండగా, ఆర్సెలార్ మిత్తల్ రూ.1.3 లక్షల కోట్లతో ఉక్కు పరిశ్రమ, పోర్టు ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటితో పాటు డేటా సెంటర్ పెట్టుబడులు చేరడంతో విశాఖ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది.




















