ఇంటర్నెట్ డెస్క్: ప్రాణాంతక క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తుండగా ఇటీవల వీటిలో ఎంతో పురోగతి కనిపిస్తోంది. అయితే, ఈ కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌లు ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో వ్యాధి నిరోధానికి ఉద్దేశించినవి కావని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే చికిత్స పొందిన వారిలో ఇది పునరావృతం కాకుండా ఉండేందుకేనని చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెద్దపేగు క్యాన్సర్(సీఆర్‌సీ)కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి కొచ్చిలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆంకాలజీ సొసైటీ (GIOS) ఆధ్వర్యంలో వార్షిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ ఐఎంఏ రీసెర్చ్ సెల్ కన్వీనర్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్సా విధానాలు, వ్యాక్సిన్ రూపకల్పనలో సాధిస్తున్న పురోగతిని వివరించారు.
‘‘ ఇవి ఇప్పటికే క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తుల్లో పునరావృతం కాకుండా నిరోధించేందుకు రూపొందించిన చికిత్సాపరమైన వ్యాక్సిన్‌లు. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో క్యాన్సర్‌ను నివారించేందుకు కావు’’ అని డాక్టర్ జయదేవన్ స్పష్టం చేశారు. ఇవన్నీ క్యాన్సర్ కణాలను గుర్తించి, నాశనం చేసేలా శరీర సొంత రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చే ఓ రకమైన ఇమ్యూనోథెరపీనేనని చెప్పారు. క్యాన్సర్ చికిత్సా విధానంలో వేగంగా మార్పులు వస్తున్నాయని, ఆయా వ్యక్తులకు అనుగుణంగా చికిత్స అందించాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అరుణ్ ఆర్ వారియర్ పేర్కొన్నారు.
మూడురోజుల పాటు కొనసాగిన ఈ సదస్సులో అంకాలజిస్టులు, గ్యాస్ట్రోఎంటెరాలజిస్టులు సహా దాదాపు 200లకుపైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. క్యాన్సర్ నిర్మూలన, స్క్రీనింగ్‌తోపాటు చికిత్సా విధానాలపై చర్చించారు. సర్జరీ, రేడియేషన్, సీఆర్‌సీ జన్యు సంబంధమైన అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు.




















