ఏ వ్యాయామం చేసినా ముందుగా కోరుకునేది బలంగా తయారవటం. ఇందుకు పరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. పరుగెత్తటం వల్ల గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ, రక్తనాళాల పనితీరు పుంజుకుంటుంది. దీంతో శరీర సామర్థ్యం, బలం ఇనుమడిస్తాయి.
- పరుగెత్తినప్పుడు శరీరంలో మొండెం, తుంటి, పిరుదులు, కాళ్ల వంటి భాగాల్లోని పెద్ద కండరాలన్నీ పాల్గొంటాయి. అందువల్ల అవి దృఢమవుతాయి. వయసు మీద పడుతున్నకొద్దీ కండరాలు క్షీణించటమనే సమస్య తగ్గుతుంది.
జబ్బుల ముప్పు తక్కువ: పరుగెత్తటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజు మోతాదులు తగ్గుతాయి. బరువూ అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె, కాలేయ జబ్బులు, మధుమేహం ముప్పులు తగ్గుముఖం పడతాయి. పరుగెత్తనివారితో పోలిస్తే పరుగెత్తేవారిలో గుండెజబ్బుతో మరణించటం సగానికి సగం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా పరుగెత్తటం వల్ల విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె కొట్టుకునే వేగమూ తక్కువగా ఉంటుంది. అంటే నెమ్మదిగా గుండె కొట్టుకుంటున్నా శరీరానికి తగినంత రక్తం అందుతుందన్నమాట. ఇది మొత్తంగా ఆరోగ్యానికి, శరీర సామర్థ్యానికి ముఖ్యమైన సూచిక కావటం గమనార్హం.
కంటి నిండా నిద్ర: సంపూర్ణ ఆరోగ్యానికి గాఢ నిద్ర ముఖ్యం. నిద్రిస్తున్నప్పుడే శరీరం మరమ్మతు అవుతుంది. అందుకే మనం నిద్ర పోయి లేచాక హుషారుగా ఉంటాం. వ్యాయామంతో త్వరగానే కాదు, గాఢంగానూ నిద్ర పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మరీ పొద్దుపోయాక పరుగెత్తటం తగదు. పరుగు వంటి ఏరోబిక్ వ్యాయామాలతో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి శక్తిని, అప్రమత్తతను పెంచుతాయి. కానీ త్వరగా నిద్ర పట్టకుండా చేయొచ్చు.
మోకాళ్లు, వెన్ను బలోపేతం: పరుగెత్తితే మోకాళ్లు దెబ్బతింటాయని చాలామంది భావిస్తుంటారు. నిజానికి తరచూ పరుగెత్తేవారికి మోకాళ్లు, వెన్ను సమస్యలు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మామూలుగా పరుగెత్తేవారితో పోలిస్తే మారథాన్ క్రీడాకారులకు కీళ్లు అరిగే ముప్పు సమారు 50% తక్కువని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆటల్లో భాగంగా పరుగెత్తేవారిలోనూ మోకాళ్లు, తుంటి సమస్యలు తక్కువని తేలింది.
జ్ఞాపకశక్తి మెరుగు: తరచూ మరచిపోతున్నారా? అయితే పరుగెత్తటం అలవాటు చేసుకోండి. ఇది మెదడులో జ్ఞాపకశక్తి, నేర్చుకోవటంతో ముడిపడిన హిప్పోక్యాంపస్ పరిమాణం పెరిగేలా చేస్తుంది. వ్యాయామం చేసేవారిలో ఈ భాగం పెద్దగా ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఉత్సాహం ఉరకలు: పరుగెత్తటం వంటి వ్యాయామాలతో ఆనందం, సంతోషం కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ధోరణిని, ఏకాగ్రతను, ఆరోగ్యంగా ఉన్నామనే భావనను పెంపొందిస్తాయి. రోజుకు కేవలం 15 నిమిషాలు పరుగెత్తినా కుంగుబాటు ముప్పు సుమారు 26% తగ్గుతున్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది. ఇప్పటికే ఉన్న కుంగుబాటు, ఆందోళన లక్షణాలూ తగ్గుముఖం పడతాయి. ఆరుబయట పరుగెత్తితే ఇంకా మంచిది. ప్రకృతిలో పచ్చని చెట్ల మధ్య వ్యాయామం చేస్తే మూడ్ ఇంకాస్త మెరుగుపడుతుంది.
ఒత్తిడి తగ్గుముఖం: పరుగెత్తటం వల్ల మానసిక ఒత్తిడికి దారితీసే అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్ల మోతాదులు అదుపులో ఉంటాయి. దీంతో బాధ, విచారం తగ్గుతాయి.
వాస్తవిక లక్ష్యాలు
రోజుకు ఎంతసేపు పరుగెత్తాలో ముందే నిర్ణయించుకుంటే పాటించటానికి వీలుంటుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుకోవటం, బరువు తగ్గటం, పందెంలో పాల్గొనటం వంటి అవసరాలను బట్టి ఎంత వేగంతో, ఎంత సమయం పరుగెత్తాలనేది ఆధారపడి ఉంటుంది. లక్ష్యం ఏదైనా సరే, అది ఆచరించటానికి వీలుండేలా చూసుకోవాలి. అంటే జీవనశైలి, సామర్థ్యాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. పరుగెత్తటం ఆరంభించేవారు ముందు నెమ్మదిగా మొదలెట్టాలి. వేగం, దూరం కన్నా ఆనందిస్తూ పరుగెత్తటం ముఖ్యం. పురోగతి సాధిస్తున్నకొద్దీ సమయం పెంచుకోవాలి.
- రోజులో ఏ సమయం అనువైందో గుర్తించాలి.
- కాసేపు పరుగు, కాసేపు నడక.. ఇలా మార్చి మార్చి కొనసాగించాలి.
- ఇతర రకాల వ్యాయామాలతో పాటు పరుగెత్తటం సాధన చేయాలి.
- స్నేహితులతో కలిసి పరుగెడితే మధ్యలో మానెయ్యకుండా చూసుకోవచ్చు.
- ఫోన్‌లో రన్నింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, ఎలా పురోగతి సాధిస్తున్నారో గమనించుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews


















